navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 10:09 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మున్సిపల్ చైర్మన్ గా మైలారపు లింబాద్రి ఎన్నిక

నవగీతం, మెట్ పల్లి:

మెట్ పల్లి మున్సిపాలిటీలో సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో రసవత్తర రాజకీయం  జరిగింది. అనూహ్యంగా బిజెపి కౌన్సిలర్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ మైలారపు లింబాద్రి చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా ఒకటో వార్డు కు చెందిన ఓంకార్ నవీన్ ఎన్నికయ్యారు. పట్టణంలోని 26 వార్డులలో పది బిజెపి గెలుపొందగా, ఆరు కాంగ్రెస్, ఆరు బిఆర్ఎస్, నలుగురు ఇండిపెండెంట్ లు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుండి మైలారపు లింబాద్రి చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరుగురు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నలుగురు మద్దతుతో పదిమంది చేతులెత్తి మద్దతు తెలిపారు. అనూహ్యంగా బిజెపి 18 వ వార్డు కౌన్సిలర్ చెట్లపల్లి మీనా సుఖేందర్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి మైలారం లింబాద్రికి మద్దతు తెలుపుతున్నట్లు చేతులెత్తి తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 11 మంది మద్దతు లభించాయి. బిజెపి చైర్మన్ అభ్యర్థిగా ఏడవ వార్డు కౌన్సిలర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ ను ప్రకటించగా 9 మంది కౌన్సిలర్లు చేతులెత్తి మద్దతు తెలిపారు, బిఆర్ఎస్ పార్టీకి చెందిన 24 వ వార్డు కౌన్సిలర్ పూదరి జ్యోతి సుధాకర్ ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించగా ఎమ్మెల్యే తో కలిసి ఏడు ఓట్లు లభించాయి. ఎన్నికల అధికారులు అత్యధిక మద్దతు11 ఓట్లు లభించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైలారపు లింబాద్రిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో చైర్మన్ గా మైలారపు లింబాద్రి ఎన్నికయ్యారు. అనంతరం ఒకటో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ ఓంకారి నవీన్ వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. దీంతో రెండు పదవులు కాంగ్రెస్ కే లభించాయి.

పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి : నూతన మున్సిపల్ చైర్మన్ లింబాద్రి

మెట్ పల్లి పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా మున్సి పల్ చైర్మన్ గా ఎన్నికైన మైలారపు లింబాద్రి తెలిపారు. పట్టణంలోని 26 వార్డులలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు, రాజకీయ నాయకులకు, తన శ్రేయోభిలాషులకు, మాజీ ప్రజా ప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావుకు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నందయ్య కు కృతజ్ఞతలు తెలిపారు.

మైలారపు లింబాద్రిని సన్మానిస్తున్న ఆర్యవైశ్య, వాసవి క్లబ్ ప్రతినిధులు