navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 1:22 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మున్సిపల్ పరిధిలో ఓటరు కానీ వ్యక్తులు ఉండరాదు

– జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి :

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం సంబంధిత మున్సిపల్ పరిధిలో ఓటర్లు కాని వ్యక్తులు ఎవరూ ఉండరాదని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, ప్రచార గడువు ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రచారకులు మున్సిపల్ పరిధిని తక్షణమే విడిచి వెళ్లాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కొనసాగితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురి చేసే చర్యలు, డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం వంటి అక్రమ కార్యకలాపాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ తరహా చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే శాంతి, భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం, ప్రచార గడువు ముగిసిన తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం పూర్తిగా నిషేధించబడిందని, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై కూడా నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికలు నిర్వహించడమే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి, పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ అశోక్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.