navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 7:17 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి

– జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల పుష్కరఘాట్లను పరిశీలన

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

గోదావరి పుష్కరాల సందర్భంగా ఘాట్లపై అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేక దృష్టి సారించామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని గోదావరి నది తీరంలో గల ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల పుష్కర ఘాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. 2027 జూలై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, రోడ్లు, ఘాట్లు, విద్యుత్ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే ధర్మపురి పట్టణానికి, కోటిలింగాల ఆలయాలకు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని, లింక్ రోడ్లు ఏర్పాట్లు, అవసరమైన చోట ఘాట్ల నిర్మాణం చేయాలని అధికారులకు వివరించారు. పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అందుకు తగిన ప్రణాళికలు ముందస్తుగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒకే రోజు రెండు లక్షల పైన భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేయాలని తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్‌తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పనుల జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. ధర్మపురి పట్టణంలోని గోదావరి నది, గోదావరి నది ప్రాంత ఘాట్లను పుష్కర ప్రాంతాలను, రాయపట్నం కోటిలింగాల పుష్కర ఘాట్లను, పరిశీలించారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో వైద్య ఆరోగ్య శాఖ, పర్యాటక, పోలీసు శాఖ,నీటి పారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఆర్డీవో, ఈఈలు, డీఈలు ధర్మపురి టెంపుల్ ఈవో, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివోలు, ఏఈలు సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.