navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 9:38 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రైతులకు ప్రభుత్వ పథకాలు చేరేలా పటిష్ట చర్యలు.. కలెక్టర్ కోయ శ్రీ హర్ష

వ్యవసాయ శాఖ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

నవగీతం, పెద్దపల్లి:

రైతులకు ప్రభుత్వ పథకాలు చేరేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో  వ్యవసాయ శాఖ పనితీరు పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ… ఎరువుల బుకింగ్ యాప్ ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉంచాలని, అవసరానికి మించి అధికంగా యూరియా వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. రైతు బీమా పథకం కింద అర్హులైన రైతులందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రైతు బీమా కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఏ కారణం చేత మరణించినప్పటికీ వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సొమ్ము వెంటనే అందుతుందని, ఈ పథకం అమలులో ఎటువంటి నిర్లక్ష్యం వహించ వద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

రైతు నమోదు కార్యక్రమం (ఫార్మర్ రిజిస్టర్) క్రింద ప్రతి రైతు తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యే విధంగా చూడాలని, ఈ ప్రక్రియలో ఏదైనా రైతు పేరు నమోదు కాని పక్షంలో వారికి పీఎం కిసాన్ సమాన్ నిధి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అందించే సహాయం అందకుండా పోతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలు మన రైతులకు తప్పనిసరిగా చేరేలా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.