నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో నిర్వహించిన ఉచిత మహిళ ఆరోగ్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు ఆధ్వర్యంలో హైదరాబాదులోని కొంపల్లికి చెందిన అవ్ని బర్త్ నెస్ట్ ఆస్పత్రి నిర్వాహకులు, సీనియర్ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ వైద్యులు హేమారెడ్డి, మెట్ పల్లిలోని శ్రీలక్ష్మి ఆస్పత్రి వైద్యులు మాధురి హాజరై మహిళలకు వైద్య సేవలు అందించారు. గైనకాలజీ విభాగంలో ఉచిత వైద్య పరీక్షలు చేశారు. మహిళలకు సంబంధించిన గర్భాధారణ, మాతృత్వ ఆరోగ్యంపై సలహాలు సూచనలు అందించారు.

మహిళలకు వచ్చే క్యాన్సర్లపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి కోరుట్ల మండలంలోని దాదాపు అన్ని గ్రామాల నుంచి మహిళలు పాల్గొని వైద్య సేవలు పొందారు. ముందుగా పైడిమడుగు గ్రామంలో గల భక్తులమర్రి దేవాలయంలో గైనకాలజిస్ట్ డాక్టర్ హేమారెడ్డి, డాక్టర్ మాధురి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ కోరుట్ల ఇంచార్జీ తిపిరి సుమ, గ్రామ సర్పంచ్ బడుగు భూమేష్, జోగినపల్లి సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, వార్డు మెంబర్ ఆకువత్తిని నిరంజన్, నాయకులు ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు