బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ దాసరి ఉష
విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి
నవగీతం, పెద్దపల్లి:
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులను కేటాయించాలని బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ దాసరి ఉష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వివిధ విద్యా సంస్థల యాజమాన్యాలతో బీసీ జేఏసీ మరియు సాదిక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విద్యకు 18 శాతం నిధులు కేటాయించాలని చేసిన సిఫారసులను పునఃసమీక్షించాలని కోరారు.ఆ 18 శాతం నిధులను కూడా ఏ విధంగా ఖర్చు చేస్తారనే అంశంపై స్పష్టత లేదని ఆమె విమర్శించారు.జిల్లాల వారీగా విద్యా సంస్థల నిర్వాహకుల అభిప్రాయాలను సేకరించి,సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఈసందర్భంగా తెలిపారు.హైకోర్టు అడ్వకేట్ మరియు సామాజిక ఉద్యమకారుడు సాదిక్ అలీ మాట్లాడుతూ గతంలో బడ్జెట్‌లో విద్యకు కేవలం 6 నుండి 7 శాతం మాత్రమే నిధులు కేటాయించడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని,ఈ నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ఖచ్చితంగా 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం పౌర సమాజాన్ని జాగృతం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నల్లవెల్లి శంకర్,బుచ్చిరెడ్డి,నీతారెడ్డి, మల్లేశం,కిరణ్,ఉమామహేశ్వర్,కుమార్,సంతోష్,రాజు,సుధాకర్,రాజేందర్,మాలిక్,అరుణ,తదితర విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.