navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 10:03 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

శివలోకం చూసిన రాత్రి

నవగీతం, హైదరాబాద్:

నంది శృంగద్వయంపై
చేతివేళ్ళు నిలిపి
శివుని దర్శనం కోసం
కన్నులు తెరిచిచూడ
వాసుకి కంఠమందు పరివేష్టితుడై
విషాన్ని కంఠమున
దాల్చిన మహాదేవుడు కానవచ్చె!

త్రిశూలం ఎత్తి,
త్రిగుణాలకు అతీతుడై
త్రిలోకాలకు స్వామి
డమరుకం మోగించి సృష్టి తాండవం చేసినవాడ
నాద బ్రహ్మంలో
లయనృత్యం చేసిన శంభో
జై మహాదేవ్!

బిల్వపత్రాలు భక్తుల
చేతుల్లో
అర్చనకు ఒక్క ఆకైనా శివునికి
ప్రియమేనని చాటి
భస్మం ధరించి
భవబంధాలు భస్మమైపోయేలా
విభూతి తీర్థంతో విశ్వాన్ని
శుద్ధి చేసినవాడ
మూడవ కన్ను తెరిచి
కాముని భస్మం చేసిన
కరుణామయుడ,
కాలాన్ని కాల్చిన కాలభైరవుడ
జటాజూటంలో గంగను
ధరించిన జగద్గురువ
అర్ధనారీశ్వరుడై అర్ధచంద్రుని అలంకరించినవాడ
భక్తిమయమైన నాహృదయంలో
భస్మంగా, వాసుకిగా, నందిగా,త్రిశూలంగా, డమరుకంగా, బిల్వంగా నిండిపోయావు
హర హర మహాదేవ…
శంభో శంకరా!

జాగరణతో నిండిన రాత్రి
శివుని నామ స్మరణలో మునిగి
శివలోకం చూసిన రాత్రి
భస్మ రాశిలో భక్తి దీపం
ప్రకాశించిన మహా శివరాత్రి
జై శంభో…జై భోలేనాథ్!


మహా శివరాత్రి శుభాకాంక్షలతో….
సాధన.తేరాల,ఖమ్మం.