అన్ని వార్డులను అభివృద్ధి చేసుకుందాం
మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి
నవగీతం, మెట్ పల్లి :
కౌన్సిల్ సభ్యులు, పట్టణ ప్రజల సమిష్టి కృషితో పురోగతి సాధిద్దామని, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. మున్సిపల్ చైర్మన్ గా గెలుపొంది తొలిసారిగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కార్యాలయ అధికారులు, ఉద్యోగులు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ లకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూలమాలలో శాలువాలతో సత్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ పట్టణాన్ని మరింత సుందరీకరణ చేసుకోవడానికి అధికారులు, ఉద్యోగులు సమిష్టి కృషితో పని చేయాలని కోరారు. అన్ని వార్డుల్లో అవసరమైన అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలోనే మెట్ పల్లి మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకువద్దామని తెలిపారు. వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడానికి సహకరించాలని కోరారు. తనను నమ్మి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, అందుబాటులో ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంగా అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కౌన్సిల్ సభ్యుల సహకారంతో మున్సిపల్ ను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మోహన్, మేనేజర్ వెంకటలక్ష్మి, డీఈ నాగేశ్వరరావు, కౌన్సిలర్ బత్తుల నరేష్, ఆర్వో మీర్జా అజ్మతుల్ల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, ఆర్ఐ అక్షయ్ కుమార్, మెప్మా టీఎంసీ సోమిడి శివకుమార్, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు