navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 9:52 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సింహ‌ వాహనంపై యోగ‌ న‌ర‌సింహుడు

ముత్య‌పుపందిరి పై కాళీయ మర్ధనుడు

నవగీతం,హైదరాబాద్:

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం 8 గంట‌లకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ‌ న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు కాళీయ మర్ధనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు ఒక్కొక్కరోజు ఒక్కొక్క వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. ప్రత్యేకంగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు.ఈ వాహ‌న‌సేవ‌లో టీటీడీ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ.వేంకటేశ్వరా రెడ్డి, హైదరాబాద్ టీటీడీ ఎఈఓ యూ రమేష్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్, హరికృష్ణ, మాజీ లోకల్ అడ్వైసరీ కమిటీ మెంబర్ ఏవి రమణారెడ్డి, పలువురు అధికారులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.