navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 3:12 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ

తీవ్రంగా మండిపడ్డ బీసీ సంఘం నాయకులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను గెలిపించండి

నవగీతం,కరీంనగర్:

స్థానిక సంస్థలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్‌లోని బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రిజర్వేషన్ల పేరుతో బీసీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ నిరంతరం మోసం చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు రిజర్వేషన్లు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం అంటూ హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని వారు ఆరోపించారు.బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాదాసు సంజీవ్ లు మాట్లాడుతూ బీసీల హక్కుల విషయంలో కాంగ్రెస్ వైఖరి మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందని అన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి, అదే బీసీలను పక్కన పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని అన్నారు. ఇది నిర్లక్ష్యం కాదు, కావాలనే చేసిన మోసమని, బీసీ సమాజం ఈ విషయాన్ని గమనిస్తోందని హెచ్చరించారు. రిజర్వేషన్ల అమలు విషయంలో స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం, బీసీలకు చట్టపరమైన భద్రత కల్పించడంలో వైఫల్యం చెందడం కాంగ్రెస్ అసలు స్వభావాన్ని బయటపెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు న్యాయం జరగలేదని, వారి ఆశలు పూర్తిగా వంచించబడ్డాయని అన్నారు. ఇచ్చిన హామీలను తప్పిన కాంగ్రెస్ పార్టీకి ఈ పురపాలక ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పాలంటే స్వతంత్ర బీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టంగా ప్రకటించారు.ఈ సమావేశంలో బీసీ సంక్షేమ మరియు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.