navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 4:53 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వరంగల్–కరీంనగర్ జంట నగరాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

నవగీతం, కరీంనగర్

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండిలో రూ. 45.15 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) కి, అలాగే రూ. 5 కోట్లతో గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వరంగల్‌కు ఔటర్ రింగ్‌ రోడ్డుతో పాటు విమానాశ్రయం పూర్తి కరీంనగర్ ఔటర్ రింగ్‌ రోడ్డుతో అనుసంధానం చేసి జంట నగరాలుగా వాటిని దేశానికే ఆదర్శంగా నిలబడే మున్సిపల్ కార్పొరేషన్లుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. “2027 లో రాబోయే గోదావరి పుష్కరాల కోసం ఆదిలాబాద్ బాసర పుణ్యక్షేత్రం నుంచి ఖమ్మం, భద్రాచలం వరకు ఉన్న అన్ని దేవాలయాలను పూర్తిస్థాయి ప్రణాళికలతో అభివృద్ధి చేస్తాం. అందుకు అవసరమైతే నాలుగైదు వేల కోట్లను ఖర్చు చేసి వాటిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని అన్నారు.

పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా, పుణ్యక్షేత్రాలుగా మధ్యలో అటవీ ప్రాంతాల్లో ఎకోటూరిజంను కూడా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, యువకులు, ఆడబిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలన్న సంకల్పంతో రూ. 2 లక్షల మేరకు రుణమాఫీ, గిట్టుబాటు ధర, సన్నవడ్లకు బోనస్, రైతు బీమా, రైతుభరోసా వంటి సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ రంగానికి దేశంలోనే అత్యధికంగా 1.15 లక్షల కోట్లను ఖర్చు చేశాం…

గడిచిన రెండేండ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. బీసీ, ఎస్సీ హాస్టళ్లు శిథిలావస్థలో ఉంటే పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నాం. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు 40 శాతం మేరకు మెస్ చార్జీలను, 200 శాతం మేరకు కాస్మెటిక్ చార్జీలను పెంచాం..ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలన్న లక్ష్యంతో ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యంతో మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే 27 వేల కోట్ల రూపాయలు అందించాం.

మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను అప్పగించడమే కాకుండా, పెట్రోల్ బంకులు, వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలను కేటాయించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కరీంనగర్ శ్రీ సీతారామచంద్ర జిల్లా మహిళా సమాఖ్యకు రూ. 110.10 కోట్ల చెక్కును అందించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేండ్లలో ఏం చేశామో శాసనసభ వేదికగా వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చేసుకునే సత్తా తెలంగాణకు ఉంది” అని అన్నారు.సభలో జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రసంగించారు. ఈ సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.