navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 2:08 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అన్‌మ్యాన్డ్ కార్మికులను విలీనం చేయాలి

సూపరింటెండింగ్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేత

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ సుదర్శనం కి మెమోరాండం సమర్పించారు. తెలంగాణ నార్తేర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్  పరిధిలో పనిచేస్తున్న అన్‌మ్యాన్డ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.కార్మికుల వివరాల ప్రకారం, ఎన్‌పీడీసీఎల్ కంపెనీలో మొత్తం 1607 మంది అన్‌మ్యాన్డ్ కార్మికులు పనిచేసేవారని, వారిలో కొందరు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించగా మరికొందరు అంగవైకల్యానికి గురయ్యారని తెలిపారు. ప్రస్తుతం సేవలందిస్తున్న కార్మికులను సంస్థలో విలీనం చేసి ఆర్టిసన్‌లుగా గుర్తించాలని కోరారు.గతంలో తెలంగాణ సౌతేర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టి.జీ.ఎస్పీడీసీఎల్) మేనేజ్‌మెంట్ 2017లో అన్‌మ్యాన్డ్/కట్టర్‌గా పనిచేస్తున్న వారిని ఆర్టిసన్‌లుగా గుర్తించిన విషయాన్ని వారు గుర్తుచేశారు.అయితే ఎన్‌పీడీసీఎల్‌లో మాత్రం ఇప్పటికీ అన్‌మ్యాన్డ్ కార్మికులను ఆర్టిసన్‌లుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.డిమాండ్ల సాధనలో భాగంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో స్వల్ప కార్యక్రమం నిర్వహించి సుదర్శనం కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కంపెనీ అధ్యక్షులు జి. ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు (బుల్లెట్), జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటరమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్ము రవీందర్ రెడ్డి, జగిత్యాల డివిజన్ అధ్యక్షులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న అన్‌మ్యాన్డ్ కార్మికులు హాజరయ్యారు.