navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 9:52 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కనుల పండువగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

నవగీతం, కోరుట్ల:

కోరుట్ల పట్టణం 6వ వార్డు పరిధిలోని యేకిన్ పూర్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలోని పంచముఖ ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా వార్డు కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో తన స్వగృహం నుండి స్వామివారికి సమర్పించే మెట్టెలు, పుస్తెలు, పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలను తలపై ధరించి భక్తిశ్రద్ధలతో శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తులను కట్టుకుంది. అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వాటిని స్వీకరించి స్వామివారికి సమర్పించారు. పంచముఖ ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం కనుల పండువగా సాగింది. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ వేడుకలో జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకను తిలకించడానికి మహిళలు, గ్రామ ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో వీడీసీ  సభ్యులు, అంజన్న మాలధారణ స్వాములు, గ్రామ పెద్దలు, యువకులు మరియు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.