navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 1:23 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఉగాది సంబరాలు

పంచాంగ శ్రావణంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న స్వామి వారి సన్నిధిలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.’పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దారం ఆదిరెడ్డితో కలిసి ఆయన స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు జితేందర్ శర్మ ఆధ్వర్యంలో మూలవిరాట్టును చందనంతో అత్యంత మనోహరంగా అలంకరించారు.ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రావణ కార్యక్రమంలో ఎమ్మెల్యే, సర్పంచ్ ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిద్ధాంతి ఈ ఏడాది ఫలితాలను వివరిస్తూ.. పరాభవ నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, గో సంపద వృద్ధి చెంది పాడిపంటలతో రైతాంగం సుభిక్షంగా ఉంటుందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యేను అర్చకులు శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు.దర్శనం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆ అంజన్నను కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసర మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.