నిర్మాణ దశలో ఉన్న వివిధ భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నవగీతం,ఇబ్రహీంపట్నం:
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన పర్యటనలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన ఆయన, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న చికిత్స, ఔషధాల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, గర్భిణీ స్త్రీలు మరియు చిన్నారులకు అందుతున్న సేవలను సమీక్షించారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన సౌకర్యాల లోటు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.అనంతరం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న వివో భవనం మరియు గ్రామ పంచాయతీ భవనాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

భవనాల నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకుని, పనులను నాణ్యతతో నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిపాలనా సేవలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, పనుల నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి ఆర్డీఓ నరసింహరావు, ఈపీఆర్ లక్ష్మణ్ రావు, వైద్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
