అత్యవసర సమయంలో రక్తదానం చేసిన వైస్ చైర్మన్ నవీన్
నవగీతం, మెట్ పల్లి:
మెట్‌పల్లి పట్టణంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండే మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు.పట్టణంలోని మీనాక్షి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రాజ్ మహమ్మద్‌కు అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమైంది. డోనర్ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో సామాజిక సేవకులు వైస్ చైర్మన్ నవీన్‌ను సంప్రదించగా, తన రక్త గ్రూప్ కూడా ఏ పాజిటివ్ అని తెలియజేసి వెంటనే స్పందించారు. ఆలస్యం చేయకుండా బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేసి రోగికి ప్రాణాధారంగా నిలిచారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ..ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం రావడం ఆనందంగా ఉందని, 18 సంవత్సరాలు పూర్తయి కనీసం 45 కిలోల బరువు ఉన్న ప్రతి యువకుడు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.ఇది ఆయన చేసిన 9వ రక్తదానం కావడం విశేషం. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, మున్సిపల్ సభ్యులు, రక్తదాతల అనుసంధానకర్త ఉదయ్ కుమార్, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు, స్నేహితులు నవీన్ ను అభినందించారు.
