navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 4:43 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

బోర్డు పరీక్షలపై విద్యార్థులకు ఉపాధ్యాయుల దిశానిర్దేశం

విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు పదో తరగతే తొలిమెట్టు అని, ఇక్కడ వేసుకునే పునాదే ఉన్నత చదువులకు బాటలు వేస్తుందని 6వ వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి అన్నారు. కోరుట్ల పట్టణం 6వ వార్డు ఏకీన్‌పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువును భయంతో కాకుండా ఇష్టపడి చదవాలని,  అప్పుడే ఉత్తమ మార్కులు సాధించగలుగుతారని విద్యార్థులకు సూచించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు మార్గం రాజేంద్ర ప్రసాద్, మాట్లాడుతూ.. పరీక్షల సమయం దగ్గరపడుతున్నందున తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులను టీవీలు, మొబైల్ ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉంచాలని కోరారు. తరగతి గదిలో రోజువారీగా బోధించిన సబ్జెక్టులను, ప్రశ్నపత్రాలను ప్రతిరోజూ ఇంట్లో ఒకటికి రెండుసార్లు చదివేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న బోర్డు (పబ్లిక్) పరీక్షల పట్ల విద్యార్థులు ఎలాంటి ఆందోళన, భయం చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రణాళికాబద్ధంగా (టైమ్ టేబుల్ ప్రకారం) చదివితే మంచి గ్రేడ్లు సాధించవచ్చని భరోసా ఇచ్చారు. పరీక్షల సరళి, సమయపాలన గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. చదువులో ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే తమను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల నిమిత్తం ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, శ్రీనివాస స్వామి,రాజిరెడ్డి, సంజీవరాణి, చైత్ర, లత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.