విద్యార్థుల్లో మాతృభాషపై మక్కువ పెంపొందించాలి: డిఈవో కె.రాము
నవగీతం, మెట్ పల్లి:
మెట్‌పల్లి డివిజన్ స్థాయి తెలుగు ప్రతిభా పరీక్షలు తెలుగు ఫోరం డివిజన్ అధ్యక్షులు చొప్పరి శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా విద్యాధికారి కె. రాము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.ఈ సందర్భంగా డిఈవో మాట్లాడుతూ నాణ్యమైన విద్య ఎంతో అవసరమని, విద్యార్థులు కనీస సామర్థ్యాలలో నైపుణ్యత సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నట్లుగా మాతృభాష ఔన్నత్యం అపారమని పేర్కొన్నారు. మన నుంచే మార్పు ప్రారంభమవ్వాలని, చక్కటి భాషాభ్యాసం ద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించగలరని తెలిపారు. మాతృభాషలో పట్టు ఉంటే ఇతర భాషల్లోనూ ప్రతిభ కనబరచగలరని, జగిత్యాల జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు, హిందీ పండితులను నియమించాలని, కనీసం పదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రతిభా పరీక్షల్లో మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని సుమారు 50 పాఠశాలల నుండి 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు డివిజన్, మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాలు అందించారు. మెట్ పల్లి డివిజన్ తెలుగు ఫోరం, ఆర్.యు.పి.పి జిల్లా శాఖల ఆధ్వర్యంలో డిఈవోతో పాటు మండల విద్యాధికారులను ఘనంగా సన్మానించారు. డిఈవో కె. రాము, మెట్‌పల్లి ఎంఈవో కనకతార, మల్లాపూర్ ఎంఈవో దామోదర్ రెడ్డి, ఆర్.యు.పి.పి జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, తెలుగు ఫోరం నాయకులు చొప్పరి శ్రీనివాస్, వి. హరికృష్ణలు బహుమతులు అందజేశారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులను డిఈవో చేతుల మీదుగా సన్మానించగా, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రశ్నపత్రాల రూపకర్త డా. ముత్యంపేట్ గంగాధర్, తంగళ్ళపల్లి నవీన్ కుమార్, కామర్తి సత్యనారాయణ, ఆకు రాజేందర్, పుప్పాల విజయసేన్, గుగులావత్ తిరుపతి నాయక్, వికాస్, భూలక్ష్మి, కవిత, శారద, భాగ్యలక్ష్మి, సత్యవతి, కొరిడె రమేష్, చిద్రాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
