స్కాలర్షిప్ కోసం కొత్త బస్టాండ్ వద్ద ధర్నా
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ కాలేజ్ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొత్త బస్టాండ్ సర్కిల్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు.నిరసనలో భాగంగా విద్యార్థులు పట్టణ ప్రధాన రహదారిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని మండిపడ్డారు.విద్యార్థుల ప్రధాన డిమాండ్లలో భాగంగా బడ్జెట్‌ను పునఃసమీక్షించి కనీసం 15 శాతం నిధులను విద్యా రంగానికి కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రి లేకపోవడం దురదృష్టకరమని, తక్షణమే నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు.“ప్రభుత్వం మద్యం అమ్మకాలపై చూపుతున్న శ్రద్ధను విద్యా వ్యవస్థపై చూపడం లేదు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండాలంటే తక్షణ చర్యలు అవసరం” అని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

తమ డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శాఖలో ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.నిరసన సందర్భంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు రంగంలోకి దిగిపోయి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.