నవగీతం, జగిత్యాల/బీర్పూర్:
జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్ పోటీల్లో బీర్పూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ కి చెందిన 9వ తరగతి విద్యార్థిని జావళి అద్భుత ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యింది. వివిధ పాఠశాలల నుండి తరలివచ్చిన విద్యార్థులతో హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో, జావళి తన అనర్గళ ప్రసంగంతో, అంతర్జాతీయ నిబంధనలపై ఉన్న అవగాహనతో నిర్ణేతలను మెప్పించారు.ప్రస్తుత సామాజిక అంశాలపై సభలో ఒక బాధ్యతాయుతమైన క్యూబా ప్రజాప్రతినిధిలా తన గళాన్ని వినిపించి, తర్కబద్ధమైన వాదనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జావళి మాట్లాడుతూ, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికవడం తనకెంతో సంతోషాన్నిస్తోందని, రాష్ట్ర స్థాయిలో కూడా జిల్లా పేరు నిలబెట్టేలా రాణిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.ఈ విజయం సాధించిన జావళిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. రాబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
