అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల హెచ్చరిక
నవగీతం,కొడిమ్యాల:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండా, గ్రామానికి చెందిన తేజావత్ నరహరి వ్యవసాయ పొలంలో పులి దాడి చేసి లేగ దూడను చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దమ్మయ్యపేట శివారులో ఉన్న నరహరి పొలం వద్ద ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు.

పులి దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు బాధితుడు తేజావత్ నరహరికి తక్షణ సహాయంగా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా అటవీ అధికారులు పరిసర గ్రామాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా దమ్మయ్యపేట, కోనాపూర్, సురంపేట, గంగారం తండా గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు.అదే సమయంలో అధికారులు ఘటన జరిగిన ప్రాంతంలో పులి సంచారం ఉన్నదేమోనని పరిశీలనలు కొనసాగిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.