navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 10:23 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సొంత నిధులతో హైమాస్ట్ లైట్లకు మరమ్మతులు

వెలుగులు నింపిన 6వ వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్

కౌన్సిలర్ చొరవపై స్థానికుల హర్షం

నవగీతం, కోరుట్ల

కోరుట్ల పట్టణం 6వ వార్డు నూతన కౌన్సిలర్ మేడిపల్లి శిరీష-శేఖర్ ఆదర్శప్రాయమైన చొరవ తీసుకున్నారు. వార్డులోని ఏకీన్ పూర్ బస్టాండ్ పరిసరాలు, అంబేద్కర్ ప్రాంగణాల్లో ఉన్న హైమాస్ట్ లైట్లు గత కొన్నేళ్లుగా బల్బులు కాలిపోయి నిరుపయోగంగా మారాయి. దీంతో రాత్రి వేళల్లో ఆయా ప్రాంతాలు కటిక చీకటిగా మారి ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కౌన్సిలర్ శిరీష శేఖర్.. తన సొంత నిధులను వెచ్చించి మున్సిపల్ ఎలక్ట్రికల్ సిబ్బందితో హైమాస్ట్ లైట్లకు మరమ్మతులు చేయించారు.

కొత్త బల్బులు అమర్చడంతో ఏళ్లుగా చీకట్లో మగ్గిన ఆయా ప్రాంతాలు ఒక్కసారిగా విద్యుత్ కాంతులతో జిగేల్మన్నాయి. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే వారికి ఈ లైట్లు ఎంతో సౌకర్యవంతంగా మారడంతో స్థానికులు, ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సొంత నిధులు ఖర్చు చేసిన కౌన్సిలర్ శిరీష శేఖర్‌ను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. నూతనంగా హైమాస్ట్ లైట్లు వెలగడంతో బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు రాత్రి వేళల్లో సైతం స్పష్టమైన దృశ్యాలు రికార్డు అయ్యే అవకాశం ఏర్పడింది. దీని ద్వారా ఏదైనా ప్రమాదాలు లేదా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పోలీసుల విచారణకు ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ ఎంతో ఉపయోగకరంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. కౌన్సిలర్ తీసుకున్న ఈ నిర్ణయం అటు ప్రజల సౌకర్యానికే కాకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు కూడా దోహదపడుతోందని పట్టణవాసులు ప్రశంసిస్తున్నారు.