మెట్‌పల్లి ప్రైవేట్ పాఠశాల వద్ద ఉద్రిక్తత
నవగీతం, మెట్ పల్లి:
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణానికి చెందిన నిఖిల్ భరత్ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాల యాజమాన్యం తరగతులకు అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది.ఈ విషయం తెలుసుకున్న హనుమాన్ మాలధారులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల మతాచారాలను గౌరవించకుండా ఇలా ప్రవర్తించడం సరైంది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపు పాఠశాల ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హనుమాన్ దీక్ష కొనసాగుతున్న సమయంలో పాఠశాలకు రావొద్దని చెప్పి, దీక్ష విరమణ అయ్యేవరకు 21 రోజుల పాటు సెలవు తీసుకోవాలని బలవంతంగా లీవ్ లెటర్ రాయించుకున్నారని ఆరోపించారు.

ఇది విద్యార్థుల మత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్య అని పేర్కొన్నారు. స్థానికులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మొదటి నుంచే ఈ పాఠశాల యాజమాన్యం ఇలాంటి చర్యలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల హక్కులను గౌరవించాలని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇరు వర్గాలతో మాట్లాడి ఉద్రిక్తతను చల్లార్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో మెట్‌పల్లి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.