navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 1:59 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలి: ఎస్పి అశోక్ కుమార్

డ్రంక్ అండ్ డ్రైవ్‌, మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందభరితంగా, సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. హోలీ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరఫున భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువకులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ద్విచక్ర వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని, స్టంట్లు చేయడం, ముగ్గురు లేదా నలుగురు ఒకే వాహనంపై ప్రయాణించడం, బైక్‌లకు సైలెన్సర్ తొలగించి నడపడం వంటి చర్యలు ప్రమాదకరమని అదేవిధంగా మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, హోలీ రోజున మైనర్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకుని వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. హోలీ వేడుకల సందర్భంగా జిల్లాలో విస్తృత స్థాయిలో పోలీస్ పెట్రోలింగ్,డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. పండుగ సందర్భంగా ఇతరులపై బలవంతంగా రంగులు వేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, మహిళలను వేధించడం, గొడవలు సృష్టించడం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే హోలీ అనంతరం స్నానాల కోసం చెరువులు, కాల్వలు, అధిక నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలు, లోతైన నీటిలోకి వెళ్లడం ప్రమాదకరమని గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.జిల్లా ప్రజలందరూ పరస్పర గౌరవంతో ఇతర మతాల వారిని గౌరవిస్తూ, మతసామరస్యంతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.