తెలంగాణలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రజా ప్రభుత్వం
తెలంగాణ పాఠ్యాంశాల్లో అంబేద్కర్ చరిత్రను చేర్చాలి
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవగీతం,హైదరాబాద్:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా “విద్య ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం” అనే సిద్ధాంతంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం డా.బి ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకల సందర్భంగా ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమక్షంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంక్షేమ శాఖమంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సమానత్వం లక్ష్యంగా పలు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు తారతమ్యం లేకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో సుమారు 25 ఎకరాల్లో రూ.200 కోట్ల వ్యయంతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్” ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ పాఠశాలలు భవిష్యత్ తరాలకు సమగ్ర విద్య, వ్యక్తిత్వ వికాసానికి కేంద్రాలుగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.

చిన్న రాష్ట్రాల ఏర్పాటు అభివృద్ధికి దోహదం చేస్తుందని అంబేద్కర్ పేర్కొన్న సిద్ధాంతం ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని ఆయన వివరించారు. దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని మంత్రి స్పష్టం చేశారు. ఈ చర్యల ఫలితంగా ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా దళిత విద్యార్థులు సివిల్స్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబర్చి ఐఏఎస్, ఐపిఎస్, తో పాటు గ్రూప్-1, 2, 3, 4 వంటి పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తున్నారని కొనియాడారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులు కేటాయించడం ద్వారా విద్యా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.

దేశవ్యాప్తంగా దళిత, గిరిజన, బడుగు వర్గాలు, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ ఐక్యతను పెంపొందించేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర గొప్పదని మంత్రి కొనియాడారు. పార్లమెంట్‌లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రమాణం చేసిన నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు దొరల, నియంతృత్వ పాలనకు ముగింపు పలికి మార్పు కోరుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని మంత్రి గుర్తుచేశారు. ఈ ప్రభుత్వంలో దళిత వర్గాల నాయకులకు పెద్దపీట వేస్తున్నారని, తాను ఒక సాధారణ కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగినదే ఇందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ పాఠ్యాంశాల్లో అంబేద్కర్ చరిత్రను చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ దళిత జాతులకు చెందిన సాంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కొమ్ము నాట్యం, డప్పు కళాకారుల ప్రదర్శనలు, మాదిగ దండోరా, బుర్రకథ, ఓగుడు, జాంబపురాణం వంటి ఎస్సీ కమ్యూనిటీ కళలు, వాటి వైవిధ్యభరిత రూపాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ప్రజా గాయకులు ఏపూరి సోమన్న, పల్లె నర్సింహులు, 57 ఉపకులాల సాంస్కృతిక కళారూపాలు ఆటపాటలతో సభను ఉత్సాహభరితంగా మార్చాయి.

అలాగే అంబేద్కర్ విగ్రహం వద్ద యం ఎన్ ఎస్ స్థాపకులు డా. బైరీ నరేష్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికను పఠించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలోనే తొలి అంబేద్కర్ మ్యూజియంను కూడా సందర్శించారు. యం ఎన్ ఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు ప్రకృతి, దళిత మేధావుల పేర్లు పెట్టడం, అక్షరాభ్యాసం నిర్వహించడం విశేషంగా నిలిచింది. అంబేద్కర్ ఆశయాలను కార్యరూపంలో నిజం చేస్తూ ప్రజా ప్రభుత్వం విద్యా, సంక్షేమ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సమానత్వ సమాజ నిర్మాణానికి బాటలు వేస్తున్నాయని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, దానం నాగేందర్, నవీన్ కుమార్ యాదవ్, మందుల సామ్యులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండ రామ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.