navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 10:01 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అన్నా.. నన్ను దేవుడే పంపిండు.. మీతో కలిసి పనిచేస్తా!’’

కెసిఆర్ తో భేటీలో  భావోద్వేగానికి లోనైనా మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఎర్రవెల్లి నివాసంలో బీఆర్‌ఎస్ అధినేతతో మర్యాదపూర్వక భేటీ

నవగీతం హైదరాబాద్:

రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత జరిగిన వీరి కలయిక అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

దేవుడే పంపించిండు అన్నా..

కేసీఆర్‌ను కలిసిన తరుణంలో జీవన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ చేతులు పట్టుకుని.. ‘‘అన్నా.. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరముంది. మీ దగ్గరికి వెళ్లి కలిసి పనిచేయమని ఆ దేవుడే నన్ను పంపించిండు. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని తన మనసులోని మాటను బయటపెట్టారు.
ఘన స్వాగతం పలికిన కేటీఆర్
ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, దుశ్శాలువాతో సత్కరించి లోపలికి తీసుకెళ్లారు. కాసేపు ఇద్దరు నేతలు ఇష్టాగోష్టిగా చర్చించుకున్నారు. అనంతరం జీవన్ రెడ్డి బృందానికి కేసీఆర్ స్వయంగా లంచ్ ఆతిథ్యం ఇచ్చారు.

ముఖ్య నేతల సమక్షంలో..

ఈ భేటీలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే డాక్టర్ కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వెంట ఆయన కుమారులు, జగిత్యాల మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ వసంత సురేశ్ దంపతులు కూడా ఉన్నారు.తెలంగాణ సాధకుడు, రైతు బాంధవుడు కేసీఆర్.. జిల్లా ప్రజల కోసం నిరంతరం పరితపించే రైతు నాయకుడు జీవన్ రెడ్డిలు ఒకే వేదికపైకి రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.