రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
నవగీతం,పెగడపల్లి:
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈనెల 20వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన కేవలం రెండు సంవత్సరాలకే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి అన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి అడ్డగోలుగా అక్రమ సంపాదన చేసిన బీఆర్ఎస్ అహంకారం తో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని ఏక వచనంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. కేటీఆర్ మాటలు దోర అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.తాము అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు కేసీఆర్ ను ఏక వచనంతో మాట్లాడలేదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని మిగిలిన రెండు గ్యారెంటీల అమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నరని మంత్రి తెలిపారు. రబీ సీజన్లో రైతులు పండించిన పంట విక్రయించడానికి ఏలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని మంత్రి కోరారు. ఐతుపల్లిలో ప్రభుత్వ స్థలం 6 ఎకరాల్లో రైతుల సౌకర్యార్థం దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఐతుపల్లి నందగిరి గ్రామాల రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఐతుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మినీ మార్కెట్ యార్డ్ గా మార్చడానికి తన వంతుగా కృషి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం పూర్తయిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వం తరఫున అధికారులు తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. రైతులను మిల్లర్ల వద్దకు రైతులను పంపించడం చేయవద్దని మంత్రి సూచించారు. ట్రక్ షీట్ లో ఇచ్చిన ప్రకారం డబ్బులు చెల్లించాలని మంత్రి అన్నారు.ఏలాంటి కోతలు విధించిన సంబంధించిన అధికారులను సస్పెండ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. మంత్రి వెంట పెగడపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.