రిపోర్టర్ అని చెప్పుకుంటూ మోసం
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు
నవగీతం, జగిత్యాల/ కోరుట్ల:
తానొక రిపోర్టర్ అని నమ్మించి కారు కన్సల్టెన్సీ నిర్వాహకులను బురిడీ కొట్టించిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల లో వెలుగుచూసింది. బాధితులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన మూటపలుకుల వెంకట్ అనే వ్యక్తి తనను తాను రిపోర్టర్ గా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో కోరుట్లలోని ‘జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ’ నిర్వాహకుల వద్ద రెండు కార్లను కొనుగోలు చేశాడు. మొదట తీసుకున్న హ్యుందాయ్ క్రెటా కారుకు సంబంధించి రూ. 2.5 లక్షలు, ఆ తర్వాత తీసుకున్న గ్రాండ్ ఐ-10 కారుకు సంబంధించి రూ. 2.15 లక్షలు.. మొత్తంగా రూ. 4.65 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ డబ్బులు ఇవ్వకుండా గత కొంతకాలంగా వెంకట్ తప్పించుకు తిరుగుతున్నాడు. కన్సల్టెన్సీ యజమానులైన చెక్కపల్లి నవీన్ మరియు కుర్ర ఆంజనేయులు తమకు రావాల్సిన బాకీ డబ్బుల గురించి నిలదీయగా, నిందితుడు వారిని తీవ్రంగా బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోగా, తన పలుకుబడితో ఇబ్బందులు పెడతానని బెదిరింపులకు దిగడంతో బాధితుడు చెక్కపల్లి నవీన్ కోరుట్ల పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మూటపలుకుల వెంకట్‌పై చీటింగ్ మరియు బెదిరింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ చిరంజీవి వెల్లడించారు.