నకిలీ దస్తావేజులతో రియల్టర్ల మోసాలు
అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక హెచ్చరిక
నవగీతం కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పట్టణంలోని చారిత్రక కోట బురుజుల స్థలాలను నకిలీ దస్తావేజులతో విక్రయించేందుకు కొందరు రియల్టర్లు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని సి. ప్రభాకర్ స్మారక గ్రంథాలయ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. కోట బురుజుల పరిసరాల్లోని ప్రభుత్వ భూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి పూర్తిగా ప్రభుత్వ భూములని, వీటిని కొనుగోలు చేస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవడమే కాకుండా చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లాభార్జనే ధ్యేయంగా రియల్టర్లు చేసే మాయమాటలు నమ్మి అమాయక ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన కోట స్థలాలను ఆక్రమించి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, డా. పేట భాస్కర్, ఎండి ముజాహిద్, చింతా భూమేశ్వర్, రాస భూమయ్య, సుతారి రాములు, భూపేల్లి నాగేశ్వరరావు, రాసకొండ పెద్ధ దేవన్న తదితరులు పాల్గొన్నారు.