navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 2:19 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గ్రామం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన యువ బాక్సర్

ఆర్థిక ఇబ్బందుల్లోనూ ప్రతిభతో మెరిసిన మోక్షిత్

అంతర్జాతీయ లక్ష్యానికి నిత్య సాయి ట్రస్ట్ భరోసా

నవగీతం ,మెట్ పల్లి ప్రతినిధి:

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామానికి చెందిన గుండ రమేష్–మమతల కుమారుడు మోక్షిత్ బాక్సింగ్ విభాగంలో తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అతను ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఎలాంటి ప్రొఫెషనల్ కోచింగ్ లేకుండానే స్వయంగా సాధన చేస్తూ బాక్సింగ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. గ్రామస్థాయి నుంచి ప్రారంభమైన అతని ప్రయాణం జాతీయ స్థాయికి చేరుకుంది. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో మోక్షిత్ విశేష ప్రతిభ కనబరిచి మెడల్ సాధించగా, రాష్ట్ర స్థాయిలో హనుమకొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన పలు పోటీల్లో బంగారు, వెండి పతకాలు గెలుచుకుని తన సత్తా చాటాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటం వల్ల ప్రాక్టీస్ కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తండ్రి రమేష్ ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో పనిచేస్తుండగా, తల్లి మమత ఇంట్లో బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ పరిస్థితుల్లోనూ మోక్షిత్ తన లక్ష్యాన్ని వదలకుండా కష్టపడుతున్నాడు.

ఈ నేపథ్యంలో మోక్షిత్ ప్రతిభను గుర్తించిన నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు ముందుకు వచ్చి అతనికి ఆర్థిక సహాయం అందించేందుకు భరోసా ఇచ్చారు. మోక్షిత్‌ను స్వయంగా కలిసి ధైర్యం చెప్పిన డాక్టర్ రఘు, అతను మరింత కృషి చేసి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. తమతో పాటు మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే మోక్షిత్ బాక్సింగ్ రంగంలో మరింత రాణించే అవకాశాలు ఉన్నాయని ట్రస్ట్ పేర్కొంది. ప్రస్తుతం నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ అందించనున్న సహకారం మోక్షిత్‌కు కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. సరైన ప్రోత్సాహం, ఆర్థిక మద్దతు లభిస్తే అతను అంతర్జాతీయ స్థాయిలో కూడా విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తాడనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.