navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 4:04 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జగిత్యాల కేసీఆర్ సభకు జనజాతరతో దద్దరిలాలి

జగిత్యాల నుండే కాంగ్రెస్ పతనం ప్రారంభం అవుతుంది

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండలంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభను జనసంద్రంగా మార్చాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సభ ఇంచార్జ్ పెద్ది సుదర్శన్ రెడ్డి.ఈ సమావేశానికి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.కార్యక్రమానికి మండలంలోని ప్రముఖ నాయకులు పునుగోటి కృష్ణారావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలకు రానున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి పార్టీ చేరికను పురస్కరించుకుని మండల స్థాయి నాయకులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకంటక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ‘కేసీఆర్ రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలి’ నినాదంతో జగిత్యాల జైత్రయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.ఒకప్పుడు రైతు, కూలీల హక్కుల కోసం పోరాటాలకు నిలయమైన జగిత్యాల, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి వేదికవుతుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని,దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.జగిత్యాల సభకు కొడిమ్యాల మండలం నుండి జైత్రయాత్రగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.