navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 11:25 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

తెలంగాణలో అన్ని చోట్లా బీసీలకు, ఈబీసీలకు అన్యాయం – పోరాటమే శరణ్యం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన 1956 నుండి ఇప్పటి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు బీసీలు, ఈబీసీలు అనుభవిస్తున్న అన్యాయాల చరిత్ర ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. పాలకులు మారినా పాలనలో ముఖ్యమంత్రికి ఉన్న సామాజిక వర్గాధిపత్యం , కులాధిపత్యం మాత్రం మారలేదు. రాష్ట్ర నిర్మాణం, రాజకీయ వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగం అన్నీ మారినప్పటికీ సామాజిక న్యాయం మాత్రం అణగారిన వర్గాలకు అందలేదు. ఈ నేపథ్యంలో 1956 నుంచి ఇప్పటి వరకు వివిధ ముఖ్యమంత్రుల పాలనలో చోటు చేసుకున్న కుల ఆధిపత్యం, బీసీలకు జరిగిన అన్యాయాలను పరిశీలించడం అత్యంత అవసరం.

1956 నుండి 2014 వరకు – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కులాధిపత్య రాజకీయాలు:

రెడ్డి కులాధిపత్యం:

ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, అంజి రెడ్డి (అంజయ్య), కోట్ల విజయభాస్కరరెడ్డి, జనార్ధన్ రెడ్డి, భవనం వెంకట్రామి రెడ్డి, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వంటి ముఖ్యమంత్రుల పాలనలో రాజకీయ శక్తి కొన్ని వర్గాల, రెడ్డి కులాధిపత్యం చేతుల్లోనే కేంద్రీకృతమైంది.

కమ్మకులం ఆధిపత్యం:

అదే సమయంలో ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు పాలనలో మరో వర్గం (కమ్మ కులాధిపత్యం అన్ని స్థాయిల్లో (మంత్రి వర్గంలో, ప్రభుత్వ అధికారులు, కార్పోరేషన్ చైర్మన్ లు, ప్రభుత్వ సలహాదార్లు, జడ్పీ చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచ్ లు మెజారిటీ కమ్మ కులమే రాజ్యం చేసి, వెర్రితలలు వేసింది.) ఈ కమ్మ కులం ప్రభావం అన్నిచోట్లా విపరీతంగా, హద్ధూ, అదుపూ లేకుండా పెరిగింది. ఈ రెండు దశల్లోనూ బీసీలకు ఉన్న జనాభా వాటా 50 శాతం పైగా ఉన్నప్పటికీ, అసెంబ్లీ, మంత్రివర్గం, కీలక అధికార పదవుల్లో వారి ప్రాతినిధ్యం 15–20 శాతం దాటలేదు.ఈ అగ్ర “కమ్మ కులాధిపత్యమే” అన్ని కీలక పదవుల్లో కొనసాగింది. రాజకీయ నాయకులు మెదలు కొని ఉన్నత శ్రేణి అధికారులు ముఖ్యమంత్రి కులానికి సంబంధించిన వారి పెత్తనమే కొనసాగింది.

తెలంగాణ ఉద్యమం – బీసీల ఆశలు:

తెలంగాణ ఉద్యమంలో బీసీలు ప్రధాన శక్తిగా నిలిచారు. సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం, విద్యా అవకాశాలు, ఉద్యోగాలు అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో ఈ వర్గాలు పోరాటం చేశాయి. “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే నినాదంతో పాటు సామాజిక సమానత్వం కూడా ముఖ్య డిమాండ్‌గా నిలిచింది.

2014–2023: కేసీఆర్ వెలమ కులం పాలన – ఆశలు తారుమారు:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో దాదాపు పది సంవత్సరాలు పాలన సాగింది. ఈ కాలంలో బీసీలకు న్యాయం జరుగుతుందని భావించినప్పటికీ, గణాంకాలు మాత్రం భిన్నమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. వెలమ దొరల పెత్తనం రాజకీయ, రాజకీయేతర పదవుల్లో, రాజకీయ సలహాదార్లతో సహా వెలమ కులం జనాభా ప్రాతిపదికన తక్కువ సంఖ్యలో ఉన్నా ముఖ్యమంత్రి వెలమ కులం కావటం వల్ల మెత్తం పాలనా యంత్రాంగం వెలమలతో నిండి పోయి పదవుల పంపిణీ వెలమ కులం ఆధారంగా వారి ఆధిపత్యంతో కొనసాగుతోంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎమ్మెల్యేల శాతం 20–25 మధ్యలోనే ఉంది. మంత్రివర్గంలో కూడా బీసీల ప్రాతినిధ్యం 15 శాతం దాటలేదు. ముఖ్యమైన శాఖలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ప్రభుత్వ కార్పొరేషన్లు, సలహాదారుల పోస్టులు, అడ్వకేట్ జనరల్ వంటి కీలక పదవుల్లో కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదు. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బీసీలకు 5–6 శాతం మాత్రమే కేటాయింపులు జరిగాయి.

విద్య, ఉద్యోగాల్లో అన్యాయం:

విద్యా రంగంలో బీసీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భారీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2022 నాటికి రూ.3000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని పత్రికా నివేదికలు పేర్కొన్నాయి.ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఉన్నత స్థాయి పోస్టుల్లో బీసీల ప్రాతినిధ్యం 10–15 శాతం మాత్రమే ఉంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల్లో బీసీల ఎంపిక తక్కువగా ఉందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి.

2024 తరువాత – రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ పేరుతో భారీ వాగ్దానాలు చేశారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అమలు విషయానికి వస్తే పరిస్థితి మారలేదనే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కీలక పదవులు, సలహాదారుల పోస్టులు, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో బీసీల ప్రాతినిధ్యం పరిమితంగానే ఉంది. పలు శాఖల్లో కీలక నిర్ణయాధికార స్థానాలు కొన్ని వర్గాలకే కేటాయించబడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి, అకడమిక్‌లు మురళీ మనోహర్, ఆచార్య తిరుమలి, ఆచార్య శ్రీనివాస్ చేసిన పరిశోధనల్లో కూడా బీసీలకు హామీ ఇచ్చిన అవకాశాలు అమలు కాలేదని స్పష్టం చేశారు.బి.ఎస్. రాములు (మాజీ బీసీ కమిషన్ చైర్మన్), రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి వంటి నిపుణులు చేసిన అధ్యయనాల ప్రకారం, 1980–2010 మధ్య కాలంలో ఉన్నత స్థాయి అధికారుల్లో బీసీల శాతం 10 శాతం లోపే ఉండేది. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో కూడా బీసీలు చాలా తక్కువగా ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

బడ్జెట్, రాజకీయ ప్రాతినిధ్యం – అసమానతలు కొనసాగుతున్నాయి.

బీసీల జనాభా 50 శాతం పైగా ఉన్నప్పటికీ, బడ్జెట్ కేటాయింపులు 10 శాతం లోపే ఉన్నాయి. బీసీ సబ్ ప్లాన్ లేకపోవడం వల్ల నిధుల వినియోగం స్పష్టంగా కనిపించడం లేదు. రాజకీయంగా కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభ స్థానాల్లో వారి శాతం తక్కువగానే ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్ణయాధికారాలు ఇతరుల (రెడ్డి కులస్తుల చేతుల్లోనే ఉన్నాయి.ఇటీవల

ఆర్టీఐ కమిషనర్ల ఎంపికలో బీసీలకు అన్యాయం:

సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాల్లో అన్నిరకాలుగా ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పుటికీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోసం ఎడతెగని పోరుసల్పిన బీసీ అభ్యర్థులు ఉన్నా కూడా వారిని నిర్లక్ష్యం చేసి
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది.ఇదే విషయాన్ని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్(ఆర్.టీ.ఐ.) కు కొత్తగా నియమితులైన కమిషనర్ల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీఫ్ కమిషనర్ జి. చంద్రశేఖర్ రెడ్డి  నూతన కమిషనర్లుగా నియమితులైన వారితో ప్రమాణం చేయించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో (ఆర్.టిఐ.) నూతన కమిషనర్లుగా నియమితులైన పీవీ శ్రీనివాస రావు , మొహిసినా పర్వీన్ , దేశాల భూపాల్ , బోరెడ్డి అయోధ్యా రెడ్డి  వరుసగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  నూతన కమిషనర్లకు అభినందనలు తెలియజేశారు.

బీసీ ఉద్యమం – పెరుగుతున్న ప్రతిఘటన

తెలంగాణలో బీసీ ఉద్యమం రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, సామాజిక కార్యకర్తలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. బీసీ సంఘాలు స్పష్టంగా చెబుతున్నాయి. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం, బడ్జెట్ కేటాయింపులు, ఉద్యోగాలు ఇవ్వకపోతే రాజకీయంగా గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాయి.

చివరిగా … పోరాటమే శరణ్యం:

1956 నుండి ఇప్పటి వరకు బీసీలకు, ఈబీసీలకు జరిగిన అన్యాయం ఒక నిరంతర ఎడ తెగని చరిత్ర. పాలకులు మారినా విధానాలు మారకపోతే సామాజిక న్యాయం సాధ్యం కాదు.ఇప్పటికైనా ప్రభుత్వం గణాంకాల ఆధారంగా, చట్టబద్ధంగా బీసీలకు న్యాయం చేయాలి. లేకపోతే బీసీలు, ఈబీసీలు ఏకమై తమ హక్కుల కోసం మరింత తీవ్రమైన పోరాటం చేయడం అనివార్యం. రాబోయే ఎన్నికల్లో తమ శక్తిని చాటుకునే దిశగా అడుగులు వేయడం ఖాయం.

డాక్టర్ కోలా హలం రామ్ కిషోర్. 9849328496