navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 11:51 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు

పొలాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

పదవ తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన వంటి అంశాలను కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షా గదుల్లో వెలుతురు, తాగునీరు, శౌచాలయాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పరీక్షలలో పారదర్శకత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ పరిశీలనలో డిఈవో కె. రాము, తహసీల్దార్ వరంధన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.