నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కలెక్టర్ ఛాంబర్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…పర్యావరణ సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.పోస్టర్‌లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ముఖ్య అంశాలు, సందేశాలు, అలాగే సేంద్రీయ ఎరువుల వినియోగం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వంటి సూచనలు ప్రతిబింబించబడ్డాయి.ఈ పోస్టర్‌ను జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు,గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల వద్ద ప్రదర్శించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కె రాము జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.