3,200 ఖాళీల భర్తీ లక్ష్యంగా మెగా జాబ్ మేళా
నవగీతం,ఖమ్మం:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మెగా జాబ్ మేళాను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమై మే 4న నిర్వహించనున్న జాబ్ మేళా నిర్వహణపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, అందులో మెగా జాబ్ మేళా ఒక ముఖ్య కార్యక్రమమని పేర్కొన్నారు.జాబ్ మేళా ద్వారా మొత్తం 3,200 ఖాళీలను భర్తీ చేయనున్నామని, సుమారు మూడు రెట్లు అంటే 10 వేల మంది యువత హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మెగా జాబ్ మేళా నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించి, వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరైన వేదికను ఎంపిక చేయాలని ఆదేశించారు. యువతను పెద్ద ఎత్తున సమీకరించేలా ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ చానెల్స్, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.మెగా జాబ్ మేళాలో 80కి పైగా కంపెనీలు పాల్గొననున్నందున, వేదిక ఎంపికకు ముందు పోలీసు శాఖతో సమన్వయం చేయాలని, ప్రతి జిల్లాఅధికారి తనకు కేటాయించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.వేదిక విశాలంగా ఉండి, వేచి ఉండే ప్రదేశం, కూర్చునే సదుపాయాలు, కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేసుకునే స్థలం ఉండాలని, ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా ఉండాలని తెలిపారు. తాగునీరు, ఈవెంట్ కోఆర్డినేటర్లు, దిశా నిర్దేశక బోర్డులు, సైన్ బోర్డులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెగా జాబ్ మేళా వేదికలో హై స్పీడ్ ఇంటర్నెట్, సాంకేతిక సిబ్బంది, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఐటీ మౌళిక సదుపాయాలు సిద్ధంగా ఉండాలని, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, సరిపడా పార్కింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణంలో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, క్యూఆర్ కోడ్ ద్వారా కంపెనీల వివరాలు, ఖాళీల సంఖ్య, అర్హతలు వంటి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలని తెలిపారు. టాస్క్ ద్వారా 80కి పైగా కంపెనీలు ఉదయం సమయానికే వేదికకు చేరుకునేలా చూడాలని, వారికి నగరంలో వసతి వంటి సదుపాయాలు సమకూర్చాలని సూచించారు.అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ మెగా జాబ్ మేళా నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని సూచించారు.అభ్యర్థుల నమోదు, ఇంటర్వ్యూల నిర్వహణ, కంపెనీల సమన్వయం,యువత సమీకరణ వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళిక తో వ్యవహరించాలని తెలిపారు. ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డివైఎస్ఓ సునీల్,ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ డబ్ల్యూ.జె. ప్రవీణ్ కుమార్, జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి, అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ ఈ. నకుల్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుమాధవ్, ఈడీఎం దుర్గ ప్రసాద్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
