navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 2:38 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రాష్ట్రమంతా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

నవగీతం, హైదరాబాద్:

భానుడి భగభగలతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో వడదెబ్బ బారిన పడి ఇద్దరు వృద్ధులతోపాటు నలుగురు వ్యక్తులు మరణించారు. మరో రెండు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండబోదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమరం భీమ్‌ – అసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లా కేంద్రమైన అసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లా బుట్టాపూర్‌, నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది వేసవిలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే ప్రథమం. కాగా, వివిధ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే రికార్డయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 104 ప్రాంతాల్లో వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కాగా, ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మానేరు నది సమీపాన పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదెల వాసి దాసరి రమేశ్‌ (50).. రాజన్న-సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావ్‌పల్లి వాసి నల్లాల మోహన్‌ (46) ఇంటి నిర్మాణ పనులు చేస్తూ వడదెబ్బ గురై మరణించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల వాసి లింగాల రాములు (59) పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి గట్టుపైనే సొమ్మసిల్లి పడిపోయాడు.
వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం బోజ్యా నాయక్‌ తండా వాసి భూక్య జంకు (65) శనివారం మధ్యాహ్నం తోటలో పని చేస్తుండగా ఎండదెబ్బకు గురై కుప్పకూలడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిజామాబాద్‌, రాజన్న-సిరిసిల్ల, సంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ఇందల్‌వాయి మండలాలు, సిరిసిల్లలోని కోనారావుపేట మండలంలో కురిసిన అకాల వర్షం వల్ల ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. రోడ్లపై చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతోపాటు సాయంత్రం కురిసిన వర్షంతో సంగారెడ్డి జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు..