navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 2:37 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

శంకర్ గౌడ్ ఆత్మబలిదానం కలచివేసింది: డాక్టర్ రఘు చిట్నేని

కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలి

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానం చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ వైద్యుడు, సామాజిక సేవకుడు డాక్టర్ రఘు అన్నారు. హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఒక కార్మిక బిడ్డను కోల్పోవడం యావత్ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు.ఆత్మహత్యలు ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేశారు. మరణం నిశ్శబ్దాన్ని మిగిలిస్తుందని, కానీ పోరాటానికి సజీవమైన గొంతుక అవసరమని చెప్పారు.కార్మికులు నిరాశకు లోనుకాకుండా ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రాణాలు తీసుకుని కుటుంబాలను అనాథలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మన హక్కుల కోసం ఐక్యంగా పోరాడితే విజయం సాధ్యమవుతుందని అన్నారు..ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని విడనాడాలని సూచించారు. శంకర్ గౌడ్ మరణానికి నైతిక బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్మికుల హక్కులు రాజ్యాంగబద్ధమైనవని గుర్తుచేశారు. వారికి రావాల్సిన ప్రయోజనాలు ఆలస్యం చేయకుండా అందించాలని అన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కార్మికుల ఆవేదనను ప్రభుత్వం గౌరవంగా వినాలని సూచించారు. ఇలాంటి విషాదాలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్మికుల సంక్షేమమే సమాజ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. శంకర్ గౌడ్ త్యాగం వృథా కాకుండా న్యాయం జరగాలని డాక్టర్ రఘు ఆకాంక్షించారు.