కాళ్ల మీద పడ్డ కనికరించని మంత్రులు,ఎమ్మెల్యేలు
నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామానికి చెందిన ముదిగంపల్లి లక్ష్మీరాజం న్యాయం కోసం ఏడాది కాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన, ఇప్పుడు బతుకుదెరువు కోసం హమాలీ, సెంట్రింగ్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో స్పెషల్ బీఎడ్ పూర్తి చేసిన లక్ష్మీరాజం 2008లో సర్వశిక్షా అభియాన్‌లో చేరి, అనంతరం ఇనక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేశాడు. 2012లో వీఆర్‌ఏ.గా ఎంపికై 11 ఏండ్లు సేవలందించాడు. వీఆర్ఏ. పోస్టులు రద్దు కావడంతో 2023లో వేములవాడ మున్సిపాలిటీలో వార్డు అధికారిగా చేరాడు.2024లో డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికైన లక్ష్మీరాజం అక్టోబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకుని, కొడిమ్యాల జడ్పీ హైస్కూల్లో విధులు ప్రారంభించాడు.అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ విషయంలో వివాదం తలెత్తడంతో, 8 నెలల తర్వాత 2025 మే 8న ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.“సీఎం ఇచ్చిన నియామక ఉత్తర్వులు ఎలా చెల్లవు?” అంటూ లక్ష్మీరాజం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.సర్టిఫికెట్ గడువు, వెరిఫికేషన్ ప్రక్రియలో స్పష్టత లేకపోవడమే తనకు అన్యాయం జరిగిందని చెబుతున్నాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. గతంలో చేసిన మున్సిపల్ ఉద్యోగం అయినా తిరిగి ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యే మంత్రులు. మేడిపల్లి సత్యం అడ్లూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ కార్యాలయం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగిన న్యాయం జరగడంలేదని లక్ష్మీరాజం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు నాకు న్యాయం చేయగలరని బాధితుడు కోరుతున్నాడు.ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.డీఎస్సీ నోటిఫికేషన్, అర్హతల నిర్ధారణలో లోపాల వల్లే లక్ష్మీరాజం వంటి వారు నష్టపోతున్నారని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.
