navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 5:40 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సురభి నవీన్ కుమార్ ‘విజయ సంకల్ప’ ర్యాలీ

అడుగడుగునా ఘనస్వాగతం

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రెండోసారి నియమితులైన సురభి నవీన్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి కోరుట్ల నియోజకవర్గానికి విచ్చేయగా, బిజెపి శ్రేణులు స్వాగతం పలికాయి. మెట్‌పల్లి నుంచి కోరుట్ల వరకు వందలాది మంది కార్యకర్తలతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ నియోజకవర్గంలో నూతన ఉత్సాహాన్ని నింపింది.

మెట్‌పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నవీన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండే భారీ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో కోరుట్ల రహదారులు మార్మోగాయి. వందలాది బైక్‌లతో సాగిన ఈ ర్యాలీ కోరుట్లలోని ఆయన నివాసం వరకు కొనసాగింది. మార్గమధ్యలో ప్రజలు, అభిమానులు ఆయనకు పూలమాలలు వేసి నీరాజనాలు పలికారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు నవీన్ కుమార్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు.

బీజేపీ జెండానే నా ఊపిరి:నవీన్ కుమార్

ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలకు భావోద్వేగ భరోసానిచ్చారు. “రెండోసారి బాధ్యతలు అప్పగించిన పార్టీకి, నాకు అండగా నిలుస్తున్న కార్యకర్తలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా చివరి శ్వాస వరకు బీజేపీ పార్టీ కోసమే పనిచేస్తాను. కోరుట్ల నియోజకవర్గ ప్రజల క్షేమం, కార్యకర్తల సంక్షేమమే నా మొదటి ప్రాధాన్యత. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద రాజీలేని పోరాటం చేస్తా” అని స్పష్టం చేశారు.ఈ భారీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు నవీన్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు మరియు భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.