ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి
నవగీతం,రాయికల్ ప్రతినిధి:
రాయికల్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మతల్లి జాతర బోనాలు మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల సుఖశాంతులు, రైతుల అభివృద్ధి, యువతకు మంచి భవిష్యత్తు కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. జాతర సందర్భంగా గ్రామంలో భక్తుల సందడి నెలకొంది. మహిళలు సంప్రదాయ బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించగా, డప్పుల మోతలు, మంగళ వాయిద్యాలు, భక్తి గీతాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామ పెద్దలు, ముదిరాజ్ సంఘం నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, ముదిరాజ్ సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
