navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 5:54 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఓటరు జాబితా సవరణలో వేగం పెంచాలి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రివిజన్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రివిజన్ శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లను పూర్తి స్థాయిలో నియమించుకోవడంతో పాటు జిల్లా, డివిజనల్ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఇంటి నుంచి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని, తప్పు ఎంట్రీలు, తప్పు లింకింగ్‌లు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 100 శాతం పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను ధృవీకరించాలని, ఫీల్డ్ విజిట్‌ల సమయంలో తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లను వెంటనే నియమించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెండింగ్ క్లెయిమ్స్‌ను జూన్ 6లోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఓటరు పేరు సరైన పోలింగ్ స్టేషన్‌కు మ్యాప్ కావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, అధికారులు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని అన్నారు. రాష్ట్రంలో జూన్ 15 నుంచి 24 వరకు ప్రిపరేషన్, ట్రైనింగ్, ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహించి, జూన్ 25 నుంచి జూలై 14 వరకు హౌస్ టు హౌస్ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను 100 శాతం పూర్తి చేసే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రతి ఓటరు సరైన పోలింగ్ కేంద్రానికి మ్యాప్ అయ్యేలా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, నరసింహరావు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.