navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 10:56 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కేంద్ర ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోలు ఆలస్యం..

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి

నవగీతం, జగిత్యాల/ధర్మపురి:

ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు కొనుగోలులో ఆలస్యం జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లాలో కురిసిన ఆకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధవారం ఉదయం పరిశీలించారు. ధర్మపురి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చింది అని అన్ లైన్ లో ట్రక్ షీట్ తో పాటు ధాన్యం తరలిస్తున్న వాహనాలకు జిపిఆర్ఎస్ వంటి సాంకేతిక సమస్యలతో కొనుగోలు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నిబంధనలను సడలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాత పద్ధతిలో ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయడంతో కొనుగోలు ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు. వారం పది రోజుల్లో మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యంతో పాటు మక్కజొన్న కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.రైతులు ఎవరు ఆందోళన పడవద్దు ధర్నాలు రాస్తారోకోలకు దిగవద్దని రైతులు పండించిన పంటను చివరి గింజ కొనుగోలు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి తెలిపారు. అధికారులు సమన్వయం చేసుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి సందర్భంగా సూచించారు. రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్న సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని మంత్రి సూచించారు. రైతులకు ఉన్న సమస్యలు తన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, చిలుముల లక్ష్మణ్, వేముల రాజు, సౌళ్ల నరేష్, చీపురుశెట్టి రాజేష్ తదితరులు ఉన్నారు.