నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు
నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి :
న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య అత్యంత దారుణమైన, అమానుష ఘటన అని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు ఆవేదన వ్యక్తం చేశారు. కోరుట్లలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు న్యాయం చేయాల్సిన ఒక న్యాయవాదిని నడిరోడ్డుపై హత్య చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారిపోయాయో స్పష్టంగా చూపిస్తోందన్నారు.ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న ఆయన, హత్య వెనుక ఉన్న అసలు నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి రాజకీయ అండలు, అధికార ప్రభావాలు ఉన్నా కూడా వారిని వదిలిపెట్టకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నడిపించి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డాక్టర్ రఘు అన్నారు. ఒక న్యాయవాదికే రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటనే ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోందన్నారు. పోలీసులు ఈ కేసును సాధారణ ఘటనగా కాకుండా అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని పూర్తి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన కోరారు. ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి న్యాయం జరిగేలా, నిందితులు ఎంత పెద్దవారైనా చట్టం ముందు తలవంచేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డాక్టర్ రఘు డిమాండ్ చేశారు.