జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం : గంగారం మాదిగ
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
గ్రామ స్థాయిలో ఉద్యమ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యా చైతన్యాన్ని పెంపొందించే దిశగా “గో టూ విలేజ్” క్యాంపెయిన్‌ను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాదిగ సంఘ భవన్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ విభాగాల అత్యవసర సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎంఎస్పీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగారం మాదిగ మాట్లాడుతూ, “పద్మశ్రీ” మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు “గో టూ విలేజ్” కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రతి నాయకుడు గ్రామాలకు వెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ సమాజంలో నిరక్షరాస్యత అధికంగా ఉందని, ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన ప్రజలు చిన్న చిన్న సమస్యలకే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, యువత మరియు విద్యార్థులను సమావేశపరిచి విద్యాపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించిన నేపథ్యంలో ఆ ఫలాలు విద్యా, ఉద్యోగ రంగాల్లో పూర్తిస్థాయిలో మన వర్గాల వారికి అందేలా కృషి చేయడం ప్రధాన కర్తవ్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో ఉద్యమ నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ, దిమ్మెలు లేని గ్రామాల్లో నూతన దిమ్మెల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జూలై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్, ఎం.జె.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెట్టుపెళ్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్, మాజీ కౌన్సిలర్ బాలే శంకర్, బొల్లె అనిల్, జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లారపు దివాకర్, జిల్లా కార్యదర్శి సంగేపు ముత్తు, మాట్ల బుచ్చయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి మీసాల సాయిలు, మండల అధ్యక్షులు బండారి నరేష్, ధోనిపాల శంకర్, చెవులమద్ది రమేష్, మారంపల్లి శంకర్, నారపాక ప్రభాకర్, నరపాక దుబ్బయ్య, రాపెళ్లి నవీన్, మోతే సుధాకర్, బాపూరపు గంగారం, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి నక్క సతీష్ తదితరులు పాల్గొన్నారు.