నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక తహసీల్ చౌరస్తాలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ‘వీక్లీ గార్లాండింగ్’ (వారపు పూలమాలాలంకరణ) కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్ (16వ వార్డు) పొట్ట సురేందర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..1891 ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్, అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశారని, ఆయన పడిన కష్టాలు భావి తరాలకు ఎదురుకాకూడదని రాజ్యాంగాన్ని రూపొందించారని సురేందర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత మేధావిగా పేరుగాంచిన ఆయన, కేవలం దళితులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని నిర్మించారని కొనియాడారు.అలాగే ‘డిక్కీ’ జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల శ్యామ్ మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించిన గొప్ప దూరదృష్టి గల నాయకుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం, విద్యపై ఆయన ఇచ్చిన సందేశం నేటికీ మార్గదర్శకమని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో ప్రతి ఆదివారం స్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రవికుమార్ నర్రా మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ సామాజిక కార్యక్రమాన్ని నిర్వాహకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి.బి.ఐ.ఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మరియు జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ నల్లా శ్యామ్ తో పాటు పలువురు అంబేద్కర్ వాదులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
