navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 1:10 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

చింతగూడ లక్ష్మీదేవి ఆలయ భక్తుల కోసం ‘ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్’ కల్పించాలి

ఆర్టీసీ అధికారులకు సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కుమార్ వినతి

నవగీతం,మంచిర్యాల :

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీదేవి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చింతగూడ స్టేజ్ వద్ద వెంటనే ‘ఎక్స్‌ప్రెస్ రిక్వెస్ట్ బస్ స్టాప్’ ఏర్పాటు చేయాలని చింతగూడ గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ కు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..చింతగూడలోని పవిత్ర లక్ష్మీదేవి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ప్రతి వారం మరియు పండగ దినాల్లో రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఎక్స్‌ప్రెస్ బస్సులకు స్టాపింగ్ లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుండి వచ్చే వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు వేరే స్టేజీలలో దిగి, ప్రైవేట్ వాహనాలలో అదనపు ఖర్చులతో ప్రయాణించాల్సి వస్తోందని అన్నారు. ​ప్రజల, భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించి, చింతగూడ స్టేజ్ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగేలా రిక్వెస్ట్ స్టాప్ కొరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు.