నవగీతం,కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణంలోని సాయిరాంపుర కాలనీలో గల చిల్డ్రన్ పార్కును మూడవ వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ సోమవారం సందర్శించి, పార్కులోని స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్కులో చిన్నపిల్లల ఆట పరికరాలతో పాటు పెద్దలు వ్యాయామం చేసే జిమ్ పరికరాలు కూడా పాడైపోయి నిరుపయోగంగా మారాయని గుర్తించినట్లు తెలిపారు.ఈ సమస్యల వల్ల స్థానిక ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పార్కుకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా, పాడైపోయిన పరికరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని లేదా ఉన్నవాటిని తక్షణమే మరమ్మతు చేయించాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయించి పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని స్థానికులకు స్పష్టం చేశారు.ఈ పరిశీలనలో మాజీ మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, విలాసాగర్ రవి, కాలనీ వాసులు పాల్గొన్నారు.