navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 8:49 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

త్వరితగతిన మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలి

15 రోజుల్లో 100శాతం ధాన్యం కొనుగోలు పూర్తికి ప్రణాళిక

జగిత్యాల జిల్లా ధాన్యం కొనుగోలు సమీక్ష సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

రవి సీజన్ లో వరి ధాన్యాన్ని కొనుగోలు జగిత్యాల జిల్లా ఇప్పటి వరకు ఆరవ స్థానంలో నిలిచిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు పై అధికారులు, రైస్ మిల్లర్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో సీజన్ లో ఊహించని విధంగా వరి, మొక్కజొన్న దిగుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు తీసుకువచ్చిన నిబంధనలతో కొనుగోలు ఆలస్యం అయ్యాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నిబంధనలను సడలించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో గడిచిన 15 రోజులుగా కొనుగోళ్లు ఊపందుకున్నాయని మంత్రి తెలిపారు.జగిత్యాల జిల్లాలో రబీ సీజన్ లో సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 2.62 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో మరో 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారని రానున్న 15 రోజుల్లో దాన్యం కొనుగోలు 100% పూర్తి చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలులో ఇప్పటివరకు జిల్లా రైస్ మిల్లర్లు సహకరిస్తున్నారని ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యే వరకు మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. జగిత్యాల జిల్లాలో వరితో పాటు మొక్కజొన్న అధిక దిగుబడి రావడంతో రెండు పంటల రవాణా కోసం వాహనాల సమస్య ఏర్పడిందని అయినప్పటికీ ప్రత్యేక పోస్టులు ఏర్పాటు చేసి ధాన్యం, మొక్కజొన్నలు రవాణా చేస్తున్నట్లు మంత్రి వివరించారు.రెండు పంటలు అధిక దిగుబడి రావడంతో జిల్లాలో నిల్వ సామర్థ్యం సైతం కష్టంగా ఉందని మంత్రి వివరించారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని ఆరు బయట నిల్వ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. రాను 15 రోజుల పాటు అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం 100% పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

గతేడాదితో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ..

గతేడాదితో పోలిస్తే కొనుగోలు నాలుగు రెట్లు పెరిగాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొక్కజొన్న అధికంగా దిగుబడి రావడంతో ఆంధ్రప్రదేశ్ రైతుల సైతం తెలంగాణలో పంటను అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రానున్న 15 రోజులు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

రాష్ట్రంలో ఆరవ స్థానంలో జగిత్యాల జిల్లా..

ధాన్యం కొనుగోలులో జగిత్యాల జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచింది జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో ప్రస్తుతం రైస్ మిల్లర్ల వద్ద మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ చేసే సామర్థ్యం మాత్రమే ఉందని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో సుమారుగా 2లక్షల 49వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నట్లు అంచనా వేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో సేకరించిన ధాన్యాన్ని ముత్యంపేట చక్కర పరిశ్రమ, సిరిసిల్ల అపరాల్ పార్క్, పెద్దపల్లి జిల్లాకు తరలించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.