ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్ బి. సత్యప్రసాద్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు.2025-26 యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరియు రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.జిల్లాలోని పూడూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్, రైతులతో నేరుగా మాట్లాడారు. ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తూకంలో తేడాలు లేకుండా చూడాలని మరియు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని ధాన్యం కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా మరియు రైతులకు అన్ని రకాల అవగాహనాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యం జరగకుండా ఉండేందుకు మిల్ ట్యాగింగ్ (Mill Tagging) ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలోని నూకపెల్లి గుణ గంగన్ రైస్ మిల్లును సందర్శించి, అక్కడ ధాన్యం నిల్వ సామర్థ్యం మరియు మిల్లింగ్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ‘కస్టమ్ మిల్లింగ్ రైస్’ (CMR) అప్పగించాలని మిల్లర్లకు సూచించారు.జిల్లా యంత్రాంగం మరియు పౌర సరఫరాల అధికారులు సమన్వయంతో పనిచేసి, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా తేమ శాతం విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
