navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 3:50 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి..

మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దు

మిల్లర్లకు రైతుల నుంచి నష్టం జరిగితే ప్రభుత్వం భరిస్తుంది

రబీ ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత, జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీతో పాటు జిల్లాలోని చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైస్ మిల్లర్లు, వివిధ శాఖల అధికారులు, ట్రాన్స్ పోర్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ఏడాది రబీ సీజన్లలో జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడులు వచ్చాయని అన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ఇప్పటికే ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొన్ని షరతుల వలన కొనుగోలు జాప్యం జరిగిందని మంత్రి అడ్లూరి అన్నారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులు సమన్వయం చేసుకొని కొనుగోలులో, ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం తర్వాత రైతులను మిల్లర్ల వద్దకు వెళ్లి మాట్లాడమని చెప్పవద్దని అలాంటి పరిస్థితిని తీసుకురావద్దని మంత్రి అధికారులకు సూచించారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో హమాలీల కొరత వల్ల మిల్లుల్లో ధాన్యం అన్ లోడ్ చేయడం ఇబ్బందిగా మారిందని మంత్రి తెలిపారు. హమాలీల కొరతను అధిగమించి ఎప్పటికప్పుడు ధాన్యం అన్ లోడ్ అయ్యే విధంగా మిల్లర్లు అదనంగా హమాలీ లను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే తూకం వేయాలని, రైతుల వద్ద అదనపు తుకం వేయడానికి అనుమతిచ్చే అవకాశం లేదని మంత్రి తెలిపారు. రైతుల వల్ల రైస్ మిల్లర్లకు ఎలాంటి నష్టం వచ్చిన ప్రభుత్వం తరఫున సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఖరీఫ్ ధాన్యం విషయంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల జిల్లాకు లక్ష 80 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను తీసుకునే విధంగా తాను చొరవ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మిల్లర్లకు గుర్తు చేశారు. ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించిన సమస్యల సైతం పరిష్కరించి తూకం వేసిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు లో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే పోలీసులు చొరవ తీసుకొని రైతులు రోడ్లమీదకి రాకుండా సమస్య పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేయాలని మంత్రి సూచించారు. కొందరు వ్యక్తులు ధాన్యం కొనుగోలు పై రోడ్లు ఎక్కుతున్నారని రోడ్లు ఎక్కితే సమస్యలు పరిష్కారం కావాని మంత్రి ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి అన్నారు. రోడ్లు ఎక్కి వేలాది మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు ప్రభుత్వాన్ని, అధికారులను, రైస్ మిల్లర్లను బద్నాం చేయాలని కొందరు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగడానికి జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు.జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ… జిల్లాలో ఇప్పటివరకు 70 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. వారం పది రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తామని తెలిపారు. రైస్ మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచి లారీలు వెంటవెంటనే అన్ లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.